హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ కోర్స్‌లో జరిగిన ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (ఐజీపీఎల్) టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్‌లో అత్యాధునిక వసతులతో ప్రపంచస్థాయి స్పోర్ట్స్ స్టేడియం నిర్మించడంతో పాటు, ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని రాష్ట్రానికి ఆహ్వానించినట్లు గుర్తుచేశారు.
క్రీడల్లో దక్షిణ కొరియా అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి, ఇక్కడి యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోందన్నారు. చారిత్రక గోల్కొండ కోట ప్రాంతంలో నిర్వహించిన టోర్నమెంట్ నగరానికి మరింత కీర్తి తెచ్చిపెట్టిందని భట్టి కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేసుకుని కొనసాగుతున్నఈ గోల్ఫ్ కోర్స్‌ను క్రీడలతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి మరింతగా ఉపయోగించుకుంటామని చెప్పారు. అనంతరం పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు ట్రోఫీలు అందజేశారు.
